
DNews:23 Dec: వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సర్పంచ్ విజయోత్సవ ర్యాలీ విషాదంగా ముగిసింది. పోడూరు మండలం రాకంచర్ల గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో జరిగిన ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి దుర్మరణం చెందింది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.వివరాల్లోకి వెళ్తే… సోమవారం సర్పంచ్‌ల ప్రమాణస్వీకారం పూర్తవడంతో రాకంచర్ల గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ కమ్లీబాయ్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అయితే ఎలాంటి అధికార అనుమతి లేకుండా డీజేతో భారీగా ర్యాలీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ర్యాలీని గ్రామస్థులు ఆసక్తిగా చూస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ర్యాలీ జరుగుతుండగా ఏడేళ్ల చిన్నారి కుర్వా సౌజన్యపై నుంచి సర్పంచ్‌కు చెందిన కారు వెళ్లింది. కారు చక్రాల కింద నలిగిన బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమెను హుటాహుటిన పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిర్లక్ష్యంగా ర్యాలీ నిర్వహించడం, భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతితో రాకంచర్ల గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.
