
DNews:26 Nov:వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను నిబంధనలకు అనుగుణంగా, శాంతియుతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. సత్య శారద అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమన్వయ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీవో కల్పన పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో 11 మండలాల్లో 317 సర్పంచ్ స్థానాలు, 2754 వార్డు సభ్యుల స్థానాలకు ఈ నెల 27, 30 మరియు వచ్చే నెల 3 తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు.నామినేషన్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల హ్యాండ్‌బుక్‌పై పూర్తి అవగాహన తప్పనిసరి అని పేర్కొన్నారు.ఓటర్లను ప్రలోభపెట్టే నగదు, మద్యం వంటి అక్రమాలపై కఠిన పర్యవేక్షణ అవసరమని సూచించారు.చెక్‌పోస్టుల్లో నిష్పాక్షిక వాహన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
మాన్పవర్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్స్‌లు, ట్రాన్స్పోర్ట్, శిక్షణ, మెటీరియల్స్, ఖర్చుల పర్యవేక్షణ, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్‌లైన్, ఫిర్యాదు పరిష్కారం వంటి బాధ్యతలను నోడల్ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున అందరూ ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని, ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.సమావేశంలో పాల్గొన్న వారు ఆర్డీవోలు సుమ, ఉమారాణి, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు తదితరులు.
