
DNews:13 NOV:తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను రద్దు చేసి, దాని స్థానంలో ‘భూ భారతి’ చట్టాన్ని తీసుకువచ్చినప్పటికీ, రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం వాస్తవంలో వేగంగా జరగడం లేదని తెలుస్తోంది. ధరణిని బంగాళాఖాతంలో పడేశామని, భూ భారతితో సమస్యలు తీరినట్లేనని ప్రభుత్వం ప్రకటించినా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 వేల దరఖాస్తులు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. భూ భారతి చట్టం తమకు శాపంగా మారిందని రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నా చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారమవడం లేదని బాధితులు మండిపడుతున్నారు. అధికారుల గణాంకాల ప్రకారం, కేవలం కరెక్షన్ల విభాగంలోనే తహసీల్దార్ స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు మొత్తం 42,567 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే, నిషేధిత భూములకు (ప్రొహిబిటెడ్ ల్యాండ్స్) సంబంధించిన వివాదాలపై తహసీల్దార్ల నుండి కలెక్టర్ల వరకు మొత్తం 24,143 దరఖాస్తులు పేరుకుపోయాయి. ఈ విధంగా మొత్తం దాదాపు 70 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, రెవెన్యూ శాఖ తక్షణమే స్పందించి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
