
DNews:13 NOV:తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. గురువారం ఉదయం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 7.1°C డిగ్రీలుగా నమోదైంది, తిర్యాణిలో 8.2 డిగ్రీలు రికార్డయింది. ఉదయం 8 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గకపోవడంతో పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో అత్యల్పంగా హెచ్‌సీయూలో 11.8°C, రాజేంద్రనగర్‌లో 12.9°C, మరియు శివార్లలోని ఇబ్రహీంపట్నంలో 11.5°C , మరియు మారేడుపల్లి: 13.6°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న నాలుగు ఐదు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. చలికాలంలో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లు మరియు సీజనల్ ఫ్లూ పెరిగే అవకాశం ఉన్నందున, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని, ముఖ్యంగా గర్భిణులు, ఐదేళ్లలోపు చిన్నారులు, వృద్ధులు వెంటనే సమీప ఆసుపత్రులను సందర్శించాలని డీహెచ్ రవీందర్‌నాయక్ కోరారు.
