
DNews:06 NOV:నిర్మల్లో విషాదం బీడీ అలవాటు ఓ వృద్ధుడి ప్రాణాలు తీసింది. మంటల్లో చిక్కుకుని సజీవదహనమై చనిపోయిన ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా దండేపల్లి మండలం తళ్లపేట గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన నాగయ్య (55) తన భార్య, కుమారుడు, కోడలితో కలిసి నివసిస్తుండేవాడు. అయితే బుధవారం రాత్రి కుటుంబ సభ్యులందరూ తమ గదుల్లో నిద్రిస్తుండగా, నాగయ్య ఒంటరిగా తన గదిలో నిద్రించాడు.
బీడీ తాగే అలవాటు ఉన్న అతను అర్ధరాత్రి సమయంలో బీడీ వెలిగించి తాగాడు. ఆ తర్వాత దాన్ని సరిగ్గా ఆర్పకుండానే నిద్రపోయాడు. కొన్ని క్షణాల్లోనే మంటలు మంచానికి అంటుకొని గదంతా వ్యాపించాయి.
కాలిన వాసన రావడంతో కుమారుడు, కోడలికి మెలకువ వచ్చింది. వారు పరుగెత్తి వెళ్లి మంటలు ఆర్పేలోపే నాగయ్య తీవ్రంగా కాలిపోయి ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
