హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి ట్యాంక్ బండ్‌పై అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆందోళనకు దిగారు. నిమజ్జనంపై విధించిన ఆంక్షలను ఎత్తివేసి ట్యాంక్ బండ్‌పై సంప్రదాయబద్ధంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతించాలని వారు డిమాండ్ చేశారు.

నిరసనలో భాగంగా ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన బారికేడ్లను ఉత్సవ సమితి ప్రతినిధులు తొలగించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు పోలీసులు కిందపడటంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బారికేడ్లను తొలగించిన అనంతరం ఉత్సవ సమితి ప్రతినిధులు ట్యాంక్ బండ్‌పైనే బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించి, ట్యాంక్ బండ్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

గణేశ్ నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ ట్యాంక్ బండ్ వద్దే సంప్రదాయబద్ధంగా నిమజ్జనం నిర్వహించేందుకు అనుమతించాలని ఉత్సవ సమితి పట్టుబడుతోంది. ఈ అంశంపై నెలకొన్న విభేదాల నేపథ్యంలో ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది.

By Rajini