
బీసీల హక్కులు సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్తంగా ఐక్య పోరాటం అవసరమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీసీల జనాభాను శాస్త్రీయంగా లెక్కించినప్పుడే జనాభా ప్రాతిపదికన వారికి న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించడం సాధ్యమవుతుందని అన్నారు.
బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఆదివారం ‘ఓబీసీ జనగణనపై కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఓబీసీల తక్షణ బాధ్యతలు భవిష్యత్ కార్యాచరణ’ అంశంపై నిర్వహించిన జాతీయ ఓబీసీ సదస్సులో పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపట్టామని తెలిపారు.
ఇంటింటికీ వెళ్లి స్వీయ ప్రకటన ఆధారంగా వివరాలను సేకరించామని ప్రతి 150 కుటుంబాలకు ఒక ప్రభుత్వ ఉద్యోగిని కేటాయించి గణన ప్రక్రియను పూర్తి చేశామని చెప్పారు. కులగణన కేవలం జనాభా లెక్కల ప్రక్రియ కాదని సామాజిక న్యాయానికి అది పునాది అని మంత్రి పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూనే బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన న్యాయం జరిగే విషయంలో 50 శాతం రిజర్వేషన్ పరిమితిపై పునరాలోచన అవసరమన్నారు.
ప్రభుత్వ సలహాదారు వి. హన్మంతరావు మాట్లాడుతూ బీసీ కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వంద రోజుల కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం రాహుల్ గాంధీ నాయకత్వంలో ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను రోల్ మోడల్‌గా తీసుకుని దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన చేపట్టాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ కోరారు.
