
D News: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. భారత విదేశీ నిఘా సంస్థ ‘రా’ (RAW) వ్యవస్థాపకుడు రామేశ్వర్ నాథ్ కావో జీవిత కథను వెండితెరపైకి తీసుకురానున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్ సంయుక్తంగా ఈ భారీ యాక్షన్ స్పై డ్రామాను నిర్మించనున్నాయి.
‘రా’ ఆవిర్భావం నుంచి తొలి మిషన్ వరకు..
1968లో ఏర్పాటైన ‘రా’ సంస్థకు 58 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కీలక వివరాలను మేకర్స్ వెల్లడించారు. 2028 ఆగస్టు 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
నితిన్ గోఖలే రచించిన ‘జెంటిల్‌మన్ స్పైమాస్టర్’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. 1955 నుంచి 1971 మధ్య చోటుచేసుకున్న కీలక పరిణామాలు, ‘రా’ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో సంస్థ చేపట్టిన తొలి కీలక మిషన్ వంటి అంశాలను సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే సెట్స్‌పైకి..
ఈ ప్రాజెక్ట్ కోసం లియో మీడియా బృందం సుమారు రెండేళ్లుగా పరిశోధన చేసినట్లు కరణ్ జోహార్ వెల్లడించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ‘రా’ సంస్థకు నివాళిగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు.
ఇక ఈ సినిమాలో రామేశ్వర్ నాథ్ కావో పాత్రలో ఓ అగ్ర కథానాయకుడు నటించనున్నట్లు సమాచారం. అయితే ఆ హీరో ఎవరనే విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
‘బాడ్ న్యూజ్’, ‘కేసరి: చాప్టర్ 2’ తర్వాత ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలయికలో వస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌పై బాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది.
