D Spiritual: Nov 12: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ దర్శనానికి సంబంధించి కేరళ ప్రభుత్వం కేరళ హైకోర్టులో స్పష్టమైన వైఖరిని వెల్లడించింది. చట్టబద్ధమైన మెడికల్ డాక్యుమెంట్లు, అధికారిక లింగ గుర్తింపు ధృవీకరణ పత్రాలు లేనిదే ట్రాన్స్‌జెండర్లకు ఆలయ ప్రవేశం గానీ, దర్శనం కల్పించడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఈ విషయంలో ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) తీసుకున్న నిర్ణయానికే పూర్తి కట్టుబడి ఉంటామని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

కోర్టును ఆశ్రయించిన ట్రాన్స్‌జెండర్ సత్యశ్రీ షర్మిల

తమిళనాడుకు చెందిన సత్యశ్రీ షర్మిల రెహమత్‌అలీ అనే ట్రాన్స్‌జెండర్.. శబరిమల ఆలయ దర్శనానికి అయ్యప్ప భక్తులు పాటించే అన్ని నియమాలను పాటిస్తూ తమకు ప్రవేశం కల్పించాలని కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తాను గతంలో కూడా శబరిమలను దర్శించుకున్నానని ఆమె తెలిపారు. అయితే, ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన పంపా గణపతి ఆలయం వద్ద పోలీసులు చేపట్టిన సాధారణ తనిఖీల సమయంలో అధికారుల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. శబరిమల ఆలయ ప్రత్యేక వయస్సు, లింగ ఆధారిత పవిత్ర ఆచారాల కారణంగా.. తమిళనాడులోని సంబంధిత వైద్య అధికారుల నుంచి లింగ మార్పిడికి సంబంధించిన సరైన గుర్తింపు పత్రాలు చూపించాలని పోలీసులు సూచించినట్లు ఆమె వివరించారు. ఈ పరిణామాల అనంతరం తిరువోణం పర్వదినాన దర్శనం కల్పించాలని కోరుతూ కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారులు, టీడీబీకి ఆమె వినతిపత్రాలు సమర్పించారు.

Sabarimala Temple:ప్రభుత్వ మరియు దేవస్వమ్ బోర్డు ప్రధాన వాదనలు
అధికారిక ధృవీకరణ తప్పనిసరి: లింగ మార్పిడి లేదా లింగ ధృవీకరణ పత్రాలు లేని పక్షంలో ఆలయ దర్శనానికి అనుమతించడం ఎంతమాత్రం సాధ్యపడదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
సాంకేతిక సదుపాయాల లేమి: ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల లక్షణాలను పరిశీలించి, వారి లింగాన్ని అధికారికంగా నిర్ధారించే సాంకేతిక సదుపాయాలు లేదా చట్టబద్ధమైన అధికారాలు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డుకు లేవని పేర్కొంది.
సాంప్రదాయాల పరిరక్షణ: లింగ నిర్ధారణ లేకుండా ఎవరినైనా ఆలయంలోకి అనుమతిస్తే తరతరాలుగా కొనసాగుతున్న పవిత్ర ఆచారాలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని దేవస్వమ్ బోర్డు యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసింది. ఆలయ ఆచార వ్యవహారాల ఉల్లంఘన జరగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు యథాతథ స్థితి

శబరిమలలో అమలులో ఉన్న నిబంధనలు, సంప్రదాయ ఆచారాలు, మతపరమైన హక్కులకు సంబంధించిన వివాదాలన్నీ ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమక్షంలో విచారణలో ఉన్న విషయాన్ని కేరళ ప్రభుత్వం హైకోర్టుకు గుర్తుచేసింది. సుప్రీంకోర్టు ఈ అంశంపై పూర్తిస్థాయి తీర్పు వెలువరించే వరకు ఆలయ పవిత్రతను, శతాబ్దాలుగా వస్తోన్న ఆచార వ్యవహారాలను కాపాడటం తమ ప్రధాన బాధ్యత అని ప్రభుత్వం వివరించింది. ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకు అవకాశం ఇవ్వకుండా ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కేరళ ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *