
DNews:17 NOV:హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టయ్యాడు. ఈ చర్యను ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ అభినందించారు. పైరసీ వల్ల సినీ పరిశ్రమ తీవ్ర నష్టం చవిచూస్తోందని, ఇలాంటి ముఠాలను పట్టుకోవడం స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. సీపీ సజ్జనార్ నేతృత్వంలో జరిగిన ఆపరేషన్‌ను ఆయన ప్రశంసించారు.
సీపీ సజ్జనార్ వివరాల ప్రకారం, రవి వద్ద 21 వేల పైరసీ సినిమాలు, 50 లక్షల మంది డేటా లభించాయి. పైరసీ ద్వారా రూ.20 కోట్లు సంపాదించినట్లు తెలిపారు. అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్ సర్వర్లతో 110 డొమెయిన్‌లను నడుపుతూ, ఒకటి బ్లాక్ అయితే మరొకటి ప్రారంభించేలా వ్యవస్థ సాగించాడు.
రవికి నేరప్రవృత్తి ఉండటంతో, భారత పౌరసత్వాన్ని వదిలి St. Kitts & Nevis దేశ పౌరసత్వం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు, రాజమౌళిలు కూడా సీపీ సజ్జనార్‌ను కలిసి అభినందించారు.
సజ్జనార్ ప్రజలకు హెచ్చరిక చేస్తూ పైరసీ వెబ్‌సైట్ల వినియోగాన్ని మానుకోవాలని, డేటా లీక్ ప్రమాదం అధికమైందని చెప్పారు. రవితో కలిసి ఉన్న మిగతా నేరగాళ్లను కూడా త్వరలో బహిర్గతం చేస్తామని తెలిపారు.
