స్లాట్ బుక్ చేసుకుని చలాన్ల డబ్బులు ముందే చెల్లించినా రిజిస్ర్టేషన్ కోసం రోజుల తరబడి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు, భూ కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలోని వేలేరు, పరకాల, కమలాపూర్, దామెర, ఐనవోలు, కాజీపేట మండలాల్లో ఆగస్టు 25 నుంచి 31 వరకు భూ భారతి రిజిస్ర్టేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. కలెక్టరేట్ డి-సెక్షన్ సూపరింటెండెంట్ నాగరాజు అనాలోచిత నిర్ణయాలే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగాలు, ఉపాధి వదిలి వారం రోజులుగా రిజిస్ర్టేషన్ కోసం ఎదురుచూస్తున్న బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాత ఆపరేటర్లను విధుల నుంచి తొలగించిన అధికారులు పోర్టల్‌లో వారి లాగిన్ ఐడీలను డిసేబుల్ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొత్త సిబ్బందికి లాగిన్ ఐడీలు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం ఎందుకని మండిపడుతున్నారు. పర్యవేక్షణ లోపంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూముల మార్పిడి కుటుంబ హక్కుల బదిలీ వారసత్వ నమోదు గిఫ్ట్ డాక్యుమెంట్లు, సేల్ డీడ్స్ వంటి అత్యవసర రిజిస్ర్టేషన్లు నిలిచిపోవడంతో వందలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ర్టేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతుల ఆవేదన అధికారులకు పట్టడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
భూ భారతి ఆపరేటర్ల కొనసాగింపులో సీనియారిటీ ప్రకారం తొలి ఏడుగురికే అవకాశం ఉంటుందని డి-సెక్షన్ సూపరింటెండెంట్ నాగరాజు స్పష్టం చేసినా ఆచరణలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియారిటీ జాబితాలో 11వ స్థానంలో ఉన్న ఓ ఆపరేటర్‌ను నిబంధనలకు విరుద్ధంగా 7వ స్థానంలోకి తీసుకొచ్చి విధుల్లో కొనసాగించారని పలువురు ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు.
అతడికి లబ్ధి చేకూర్చేందుకు సీనియర్‌గా ఉన్న వేలేరు తహసీల్దార్ కార్యాలయ ఆపరేటర్‌ను తొలగించేందుకు ప్రయత్నాలు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. సీనియర్లను పక్కనబెట్టి జూనియర్‌ను ముందుకు తీసుకురావడం వెనుక కారణమేంటని ప్రశ్నిస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ పొరపాట్లు, అధికారుల సమన్వయ లోపంతో ఏర్పడిన సమస్యను వెంటనే పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.