జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లు గైర్హాజరైన ఘటనపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన వారిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరత డ్యూటీ డాక్టర్ గైర్హాజరు, ప్రైవేట్ వైద్యుడితో చికిత్స అందించినట్లు వచ్చిన మీడియా కథనాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ విషయంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చొంగ్తుతో మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు విధులకు తప్పనిసరిగా హాజరయ్యేలా పర్యవేక్షణను కఠినతరం చేయాలని మంత్రి సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

By Rajini