D Educt: Nov 12: ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ విద్యావ్యవస్థ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యే లక్ష్యం: భట్టి విక్రమార్క

ప్రపంచంతో తెలంగాణ రాష్ట్రం పోటీపడే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు ఉన్నత విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో నవంబర్ 11న హనుమకొండ జిల్లా కాజీపేట విద్యానగర్‌లో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్యతోనే సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో సెమీ రెసిడెన్షియల్ విధానంలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించడమే ఈ పాఠశాలల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో ఆధునిక బోధనా పద్ధతులు, డిజిటల్ తరగతులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. విద్యార్థులకు పాఠశాలలోనే అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు, వారిని ఇళ్ల నుంచి పాఠశాలకు తీసుకొచ్చి తిరిగి ఇళ్ల వద్దకు చేర్చేలా రవాణా సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా బోధన, బోధనేతర సిబ్బందికి అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యనభ్యసించేలా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులుగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కుడా ఛైర్మన్ గుండు సుధారాణి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *