
D Educt: Aug 14: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ: మైక్రోసాఫ్ట్‌తో డేటా సెంటర్ శిక్షణ.. రెండో బ్యాచ్ ప్రారంభం
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో మైక్రోసాఫ్ట్ సహకారంతో నిర్వహిస్తున్న డేటా సెంటర్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ శిక్షణ కార్యక్రమం రెండో బ్యాచ్ గురువారం ప్రారంభమైంది. యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఈ శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ దీనికి గుర్తింపును అందించింది.
హైదరాబాద్‌లోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ట్రాన్సిట్ క్యాంపస్‌లో ఈ శిక్షణ కొనసాగనుంది. రెండో బ్యాచ్‌లో మొత్తం 40 మంది విద్యార్థులు చేరారు. డేటా సెంటర్ రంగంలో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వీసీ సుబ్బారావు తెలిపారు.
ఇప్పటికే పూర్తయిన మొదటి బ్యాచ్ మంచి ఫలితాలను సాధించిందని ఆయన వెల్లడించారు. మొదటి బ్యాచ్‌లో శిక్షణ పొందిన విద్యార్థుల్లో 80 శాతం మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని రెండో బ్యాచ్ విద్యార్థులకు కూడా మెరుగైన నైపుణ్యాలు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
డేటా సెంటర్ ఆపరేషన్స్ రంగంలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడం ద్వారా వారి ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కమ్యూనిటీ ఎఫైర్స్ డైరెక్టర్ (ఏపీఏసీ) టియాంజీ డికెన్స్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సీఈఓ రేఖా శ్రీనివాసన్, స్ట్రాటజీ అండ్ ఇంపాక్ట్ లీడ్ భరత్ మెరుగు, మైక్రోసాఫ్ట్ కమ్యూనిటీ ఎఫైర్స్ మేనేజర్ హర్ష తదితరులు పాల్గొన్నారు.
