
బోనాల పర్వదినం వేళ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ కలకలం రేపింది. పూజల కోసం ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలి బ్యాగ్‌ను గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసినట్లు సమాచారం.
బాధితురాలు పూజలు చేస్తున్న సమయంలో దుండగుడు ఆమె బ్యాగ్‌ను చాకచక్యంగా కత్తిరించి.. అందులోని పౌచ్‌ను అపహరించి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. పౌచ్‌లో ఐదు వెండి బిస్కెట్లు, రూ.5 వేల నగదు ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.
బోనాల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని దుండగుడు చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆలయంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
పెద్దమ్మతల్లి ఆలయానికి బోనాల సందర్భంగా భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో భద్రతా చర్యలు మరింత పెంచాలని భక్తులు కోరుతున్నారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేసి. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
