
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్తగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్డులను జారీ చేయనున్నారు. ఇప్పటికే 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. కార్డులను ఆయా జిల్లాలకు కూడా అధికారులు చేరవేశారు.
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఆధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందించారు. కార్డుపై డిజిటల్ క్యూఆర్ కోడ్ ఉండటంతో లబ్ధిదారుల వివరాలను వేగంగా గుర్తించే అవకాశం ఉంటుంది. రేషన్ కార్డు నంబర్, కుటుంబ యజమాని పేరు సంబంధిత రేషన్ షాపు నంబర్ తదితర వివరాలు కార్డులో పొందుపరచనున్నారు.
స్మార్ట్ రేషన్ కార్డు ముందు భాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలను ముద్రించారు. లబ్ధిదారులను సులభంగా గుర్తించేందుకు అవసరమైన ఇతర సమాచారాన్ని కూడా కార్డులో చేర్చారు. నకిలీ కార్డుల తయారీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కార్డుల్లో ప్రత్యేక భద్రతా ఫీచర్లను పొందుపరిచారు.
ప్రభుత్వ హోలోగ్రామ్, ఎంబోస్డ్ టెక్స్ట్, మైక్రో టెక్స్ట్, వాటర్‌మార్క్, ఇన్విజిబుల్ యూవీ లోగో, గిల్లొషే ప్యాటర్న్స్ వంటి భద్రతా అంశాలను ఇందులో ఉపయోగించారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారుల గుర్తింపు మరింత సులభతరం కావడంతో పాటు రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
