
DSports Dec16 2025: భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును సొంతం చేసుకుంది. నవంబర్ 2025 నెలకు గాను ఆమె ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికైంది. ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆమె కనబర్చిన అద్భుత ప్రదర్శనకు ఈ గౌరవం దక్కింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆమె ఆల్-రౌండ్ షోతో అదరగొట్టింది. ఆ మ్యాచ్‌లో షఫాలీ ధాటిగా ఆడి 87 పరుగులు చేయడమే కాక, బంతితో కీలక సమయంలో రెండు వికెట్లు పడగొట్టింది. ఆమె ప్రదర్శనతోనే భారత్ తొలిసారిగా ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ సందర్భంగా షఫాలీ వర్మ మాట్లాడుతూ, తన తొలి ప్రపంచకప్ అనుభవం అద్భుతంగా ముగిసిందని, ఈ అవార్డును తన సహచరులు, కోచ్‌లు, కుటుంబ సభ్యులకు అంకితం ఇస్తున్నానని తెలిపింది. మొదట్లో ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కకపోయినా, అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఫైనల్లో అద్భుతం సృష్టించిన షఫాలీకి ఈ అవార్డు దక్కడం విశేషం.
