
సాధారణంగా ఆలయాల్లో పూజలు, భజనలు, హారతులు, వేదమంత్రాలతో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. కానీ నల్గొండ జిల్లా చింతపల్లిలోని ఓ సాయిబాబా ఆలయంలో మాత్రం ప్రతిరోజూ మధ్యాహ్నం 12.30 గంటలకు వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. మంత్రాలకు బదులు జాతీయ గీతం ‘జనగణమన’ వినిపిస్తుంది. భక్తులు దేవుడి ముందు చేతులు జోడించడమే కాదు.. దేశం ముందు గౌరవంగా నిలబడి జాతీయ గీతాన్ని ఆలపిస్తారు.
హైదరాబాద్–నాగార్జునసాగర్ హైవేపై చింతపల్లిలో 2007లో కొందరు భక్తులు ఈ సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని సాయిబాబాను దర్శించుకుంటారు. పూజలు, భజనలు, సాయి స్మరణతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది.
అయితే ప్రతిరోజూ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆలయ ప్రాంగణంలో భక్తులంతా ఒకచోట చేరి గౌరవంగా నిలబడి జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ‘జనగణమన’తో ఆలయ ప్రాంగణం మార్మోగుతుంది. ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో జాతీయ గీతాలాపనను ఆలయ నిత్య కార్యక్రమాల్లో భాగం చేశారు.
ఈ సంప్రదాయం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. జాతీయ పర్వదినాల సందర్భంగా సాయిబాబా విగ్రహాన్ని జాతీయ పతాకంలోని రంగులతో అలంకరించడం కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తులు జాతీయ గీతాలాపనలో పాల్గొంటుండటంతో దేశం పట్ల గౌరవం, జాతీయ భావనను చిన్న వయసు నుంచే పెంపొందించే సందేశం అందుతోంది.
‘భక్తితో పాటు దేశభక్తి కూడా అవసరం’ అనే భావనను చాటేందుకే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఆలయ ట్రస్ట్ చైర్మన్ మంచికంటి ధనుంజయ్య తెలిపారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించడంతో పాటు సమాజంలో దేశభక్తి భావనను బలపర్చాలన్న ఉద్దేశంతో ప్రతిరోజూ మధ్యాహ్నం జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నామని చెప్పారు.
ఇలా ఈ ఆలయంలో ప్రతిరోజూ దేవుడికి మొక్కుతూ దేశానికి వందనం చేస్తున్నారు. దేవుడి ముందు భక్తి ఎంత ముఖ్యమో దేశం పట్ల బాధ్యత కూడా అంతే ముఖ్యమనే సందేశాన్ని ఈ ఆలయం అందిస్తోంది. భక్తి, దేశభక్తి కలిసే అరుదైన దృశ్యానికి చింతపల్లిలోని ఈ సాయిబాబా ఆలయం వేదికగా నిలుస్తోంది.
