
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు చేపట్టనున్న దీక్షకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని నాయకులు అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. విద్యార్థుల సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాడుతుందని ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్‌కుమార్, సౌదరి మహేందర్‌యాదవ్, కాసగోని నిర్మల, బెజ్జంకి దిలీప్‌కుమార్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చిలుక భారతి, శివంగారి సతీష్, భూతగడ్డ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.
