
మిలాద్ ఉన్ నబీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. పండుగ ఏర్పాట్లపై పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ముస్లిం మత పెద్దలతో సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ర్యాలీలు నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, నిర్ణయించిన మార్గాల్లోనే కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు తగిన సంఖ్యలో స్వచ్ఛంద సేవకులను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం వచ్చే సౌండ్ సిస్టంలు, డీజేలు, ఇతర పరికరాలను వినియోగించరాదని స్పష్టం చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ప్రసంగాలు, పాటలు, నినాదాలకు దూరంగా ఉండాలని అన్ని మతాలు వర్గాల మనోభావాలను గౌరవించాలని కోరారు. ముఖ్యంగా యువత సంయమనం, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ గొడవలు వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు.
పండుగ సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో అవసరమైన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేపడతామని సీపీ తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వాటిని నమ్మకుండా సంయమనం పాటించాలని సూచించారు. అనుమానాస్పద సమాచారం లేదా ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.
అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు లేదా రామగుండం కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656597కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమావేశంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, సీఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
