
జొన్న రైతులకు రూ.994 కోట్లు జమ చేశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. 1.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసినట్లు స్పష్టం చేశారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ జొన్న కొనుగోలు విధానాన్ని తీసుకువచ్చామని ప్రస్తావించారు. ఎంఎస్పీతో రికార్డు స్థాయిలో జొన్నలు కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందజేస్తున్నామని తెలిపారు.
FFS అమలును మరో పది జిల్లాలకు విస్తరిస్తున్నామని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. ఎరువుల విక్రయాల్లో డిజిటల్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఆధార్‌తో ఎరువులను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రియల్‌టైమ్ స్టాక్ సమాచారం తమకు ఉందని వెల్లడించారు. బ్లాక్ మార్కెటింగ్‌కు FFS వ్యవస్థ చెక్ పెడుతుందని తెలిపారు. ఆయిల్ పామ్ విస్తరణపై అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. అన్నదాతలకు వెంటనే ఆయిల్ పామ్ మొక్కలు అందజేయాలని సూచించారు.
డ్రిప్‌ను ఏర్పాటు చేయడం ఆలస్యం కాకూడదని మంత్రి తుమ్మల ఆదేశించారు. దీనిపై గ్రామాల్లో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. యువ ఆవిష్కర్తలకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందజేస్తోందని పేర్కొన్నారు. హ్యాండ్లూమ్ హ్యకథాన్-2026 విజేతను మంత్రి సన్మానించారు. జాతీయ ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థి వగ్గు శ్రీరామ్‌కు అభినందనలు తెలిపారు. నేతన్నల కోసం వినూత్న ‘ఎర్గోనామిక్ బ్యాక్ సపోర్ట్’ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు.
