ఇండియన్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (IIA) ఆధ్వర్యంలో 35వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM), MSME అవార్డ్స్ 2026 కార్యక్రమం గ్రేటర్ నోయిడాలో ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, MSME రంగానికి చెందిన వ్యాపారవేత్తలు, బిజినెస్ లీడర్లు ఈ జాతీయ సదస్సులో పాల్గొన్నారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతదేశ పారిశ్రామిక స్వావలంబనను బలోపేతం చేయడంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEs) కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం (వికసిత్ భారత్) లక్ష్యాన్ని సాధించడంలో MSME రంగం మరింత కీలకంగా మారనుందని ఆయన అన్నారు.
“MSME వృద్ధి, ప్రపంచ స్థాయి పోటీతత్వం, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్” అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. వ్యాపార నిర్వహణలో సౌలభ్యం, చెల్లింపుల్లో జాప్యం, సాంకేతికత ఆధునీకరణ, ఎగుమతి ప్రోత్సాహకాలు, పర్యావరణహిత తయారీ విధానాలు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం వంటి కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
వివిధ రంగాలకు చెందిన నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక సెషన్లు నిర్వహించి వ్యాపార విస్తరణకు అనుసరించాల్సిన ఆచరణాత్మక విధానాలు అభివృద్ధి నమూనాలపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. పారిశ్రామిక రంగంలో వినూత్న ఆవిష్కరణలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వ్యాపారవేత్తలను MSME అవార్డ్స్ 2026తో సత్కరించారు. భారత పారిశ్రామిక అభివృద్ధిలో MSME రంగం ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా ఈ జాతీయ సదస్సు కొనసాగింది.




