
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లండన్ పర్యటనలో భాగంగా పలువురు ప్రతినిధులతో వరుసగా సమావేశమవుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, విద్యా రంగంలో భాగస్వామ్యాలపై చర్చలు జరుపుతున్నారు. శనివారం లండన్‌లో లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్, ఫుట్‌బాల్ క్లబ్ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు.
ఈ భేటీలో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై లివర్‌పూల్ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, క్రియేటివ్ ఎకానమీ వంటి రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. ఇందులో భాగంగా అక్టోబర్‌లో లివర్‌పూల్ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన సందర్భంగా భాగస్వామ్యానికి సంబంధించి అధికారిక ఒప్పందం కుదుర్చుకునే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.
మరోవైపు లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీతో తెలంగాణ భాగస్వామ్యంపై కూడా చర్చలు జరిగినట్లు సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు తెలిపారు. సీఎం బృందం ఇంపీరియల్ కాలేజీని సందర్శించి, అక్కడి ప్రతినిధులతో విద్యా సహకార అవకాశాలపై చర్చించినట్లు వెల్లడించారు.
తెలంగాణలో షార్ట్‌టర్మ్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సుల ఏర్పాటుపై పరిశీలన జరుగుతోందని తెలిపారు. పరిశోధన, విద్యార్థులు-అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాల్లో భాగస్వామ్యానికి ఇంపీరియల్ కాలేజీ ఆసక్తి చూపుతున్నట్లు కె. రామకృష్ణారావు వివరించారు.
