
D Spiritual: Dec 26: ఇవాళ తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పర్యటించనున్నారు. ఈ నెల 29 వరకు తిరుపతి వేదికగా జరిగే భారత విజ్ఞాన్ సమ్మేళన్‌కు వీరంతా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం ఇవాళ ప్రారంభం కానుంది.
భారత విజ్ఞాన్ సమ్మేళన్‌లో భాగంగా సీఎం చంద్రబాబు, మోహన్ భగవత్, గజేంద్రసింగ్ షెకావత్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధిపై చర్చలు జరగనున్న ఈ సమ్మేళన్‌కు ప్రముఖులు, శాస్త్రవేత్తలు హాజరవుతున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నగర పోలీసు వ్యవస్థ మరింత బలోపేతం కానుందని అధికారులు తెలిపారు.
మరోవైపు, తిరుపతిలో ప్రముఖుల పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నగరవ్యాప్తంగా సుమారు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
