
సమర్‌కండ్ వేదికగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆదివారం జరిగిన ఐదో రౌండ్‌లో నెదర్లాండ్స్‌పై భారత్ 3-1 తేడాతో విజయం సాధించింది. దీంతో ఓపెన్ విభాగంలో భారత జట్టు వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది.
ప్రజ్ఞానంద, గుకేశ్ విజయాలు
నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో భారత స్టార్ చెస్ ఆటగాళ్లు ప్రజ్ఞానంద, గుకేశ్ తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. అనిశ్ గిరిపై ప్రజ్ఞానంద గెలుపొందగా.. ఇర్విన్‌పై గుకేశ్ విజయం సాధించాడు.
మరోవైపు జోర్డెన్ వాన్ ఫోరీస్ట్‌తో అర్జున్, లూక్ వాన్ వెలీతో నిహాల్ సరీన్ ఆడిన గేమ్‌లు డ్రాగా ముగిశాయి. దీంతో భారత్ 3-1తో నెదర్లాండ్స్‌ను ఓడించింది.
పోలెండ్ చేతిలో భారత మహిళల జట్టుకు ఓటమి
భారత మహిళల జట్టుకు ఐదో రౌండ్‌లో నిరాశ ఎదురైంది. పోలెండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1.5-2.5 తేడాతో ఓటమిపాలైంది.
మల్త్సేవ్స్కయాతో జరిగిన గేమ్‌లో వైశాలి పరాజయం చవిచూశారు. మరోవైపు హంపి, దివ్య, వంతిక తమ తమ గేమ్‌లను డ్రాగా ముగించారు. దీంతో భారత మహిళల జట్టు పోలెండ్ చేతిలో ఓటమిని ఎదుర్కొంది.
