
దాదాపు పదేళ్లుగా షూటింగ్లో కొనసాగుతున్న ఇలవేనిల్ వలరివన్ ఎట్టకేలకు ఆసియా క్రీడల్లో తన కలను నెరవేర్చుకుంది. ప్రపంచకప్, ప్రపంచ ఛాంపియన్షిప్, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో జూనియర్, సీనియర్ స్థాయిల్లో ఎన్నో పతకాలు సాధించిన ఈ తమిళనాడు షూటర్.. ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లో మాత్రం ఇప్పటివరకు పోడియం చేరలేకపోయింది. తాజాగా జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఆ లోటును భర్తీ చేసింది.
ఒకే రోజు రెండు పతకాలు
10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ఇలవేనిల్ వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్ ఈవెంట్లోనూ రజత పతకాలు సాధించింది. దీంతో ఒకే రోజు రెండు మెడల్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. 27 ఏళ్ల ఇలవేనిల్‌కు ఆసియా క్రీడల్లో ఇవే తొలి పతకాలు.
2021 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 2018 ఆసియా క్రీడల్లోనూ పతకం సాధించలేకపోయింది. అయితే ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న ఇలవేనిల్.. ఒత్తిడిని అధిగమిస్తూ తన కెరీర్లో తొలిసారి ఓ పెద్ద క్రీడా వేదికపై పోడియంపై నిలిచింది.
ప్రపంచ స్థాయిలో ఇప్పటికే ఎన్నో పతకాలు
ఇలవేనిల్ వలరివన్‌కు అంతర్జాతీయ షూటింగ్లో ఇప్పటికే ఘనమైన రికార్డు ఉంది. ప్రపంచకప్‌లో నాలుగు స్వర్ణ పతకాలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఎనిమిది బంగారు పతకాలు, జూనియర్ ప్రపంచకప్‌లో ఆరు స్వర్ణాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మూడు కాంస్య పతకాలు కూడా సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ప్రపంచ రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకుంది.
లక్ష్యం ఒలింపిక్ పతకమే
ఆసియా క్రీడల్లో సాధించిన రెండు రజతాలు తనకు ఎంతో ప్రత్యేకమని ఇలవేనిల్ పేర్కొంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత తన ఆటను మరింత మెరుగుపర్చుకోవడానికి, తన సామర్థ్యాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ఎన్నో అవకాశాలు లభించాయని తెలిపింది. టెక్నిక్‌ను సరిగ్గా ఉపయోగించడంతో పాటు తనపై తాను నమ్మకం ఉంచుకోవాలని కోచ్ నేహా చవాన్ ఇచ్చిన సలహా ఎంతో ప్రేరణనిచ్చిందని చెప్పింది.
ఈ ఏడాది చివర్లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మెరుగైన ప్రదర్శన చేయడమే తన తక్షణ లక్ష్యమని ఇలవేనిల్ తెలిపింది. అయితే తన కెరీర్లో అంతిమ లక్ష్యం మాత్రం ఒలింపిక్ పతకం సాధించడమేనని స్పష్టం చేసింది.
