
బీజేపీ కార్యకర్తలు నాయకుల అరెస్టులపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత జి. కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ నిరసన తెలిపే హక్కుతో పాటు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే తెలంగాణలో ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు జవాబుదారీతనం కోరినందుకు ప్రతిపక్ష నాయకులను నిర్బంధిస్తున్నారని విమర్శించారు.
బాధితులను పరామర్శించేందుకు నల్గొండకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం అత్యంత శోచనీయమని కిషన్ రెడ్డి అన్నారు. కేవలం బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం ఎందుకని ప్రజలను కలుసుకోకుండా వారిని అడ్డుకోవడం ఏ విధమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.
ప్రభుత్వం ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి ప్రశ్నలు అడిగిన వారినే అరెస్టు చేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతును అణచివేసేందుకు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.
నల్గొండలో బీజేపీ జిల్లా అధ్యక్షుడి నివాసంపై దాడి జరిగినప్పుడు అలాగే బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిలో యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నప్పటికీ బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దాడులకు పాల్పడిన వారిని స్వేచ్ఛగా వదిలేసి, బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ నాయకులను అరెస్టు చేయడం ఏ విధమైన న్యాయమని నిలదీశారు.
తెలంగాణ ప్రజలు రాజకీయంగా ఎంతో చైతన్యవంతులని కిషన్ రెడ్డి అన్నారు. దాడులు చేసింది ఎవరు బాధితులు ఎవరు, అధికారాన్ని ఎవరు దుర్వినియోగం చేస్తున్నారనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసని పేర్కొన్నారు. తెలంగాణ తన చరిత్రలో ఎన్నో ప్రజా ఉద్యమాలకు సాక్ష్యంగా నిలిచిందని గుర్తుచేశారు.
ప్రజల హక్కుల కోసం ఎల్లప్పుడూ పోరాడిన తెలంగాణ గడ్డపై అక్రమ అరెస్టులు నిర్బంధాల ద్వారా ప్రశ్నించే గొంతులను అణచివేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నాయకులను ఎన్నిసార్లు అరెస్టు చేసినా నిర్బంధంలో ఉంచినా ప్రజల కోసం తమ పోరాటం ఆగదని అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అన్యాయాలను వెలుగులోకి తీసుకురావడం బాధితులకు అండగా నిలవడం తమ బాధ్యత అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
