
ధర్మపురి ఉగ్రనరసింహ ఆలయ పునర్నిర్మాణ పనులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం భూమిపూజ చేశారు. రూ.10 కోట్ల పుష్కరాల నిధులతో చేపట్టనున్న ఈ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్ ఉగ్రనరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ధర్మపురి క్షేత్రానికి ఎంతో విశిష్టమైన మహత్యం ఉందని పేర్కొన్నారు. గోదావరి తీరంలోని ప్రముఖ ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
రానున్న గోదావరి పుష్కరాలను అత్యద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని భట్టి విక్రమార్క వెల్లడించారు. పుష్కరాల నిర్వహణ కోసం ఇప్పటికే రూ.1,000 కోట్ల నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు. అలాగే రూ.200 కోట్లతో ధర్మపురి, కోటిలింగాల క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
