వరంగల్‌ను అన్ని రంగాల్లో హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, టెంపుల్, ఫారెస్ట్ టూరిజం, వరంగల్ ఎయిర్పోర్ట్ రోడ్ కనెక్టివిటీ, బస్ టెర్మినల్, ఔటర్ రింగ్ రోడ్డు తదితర కీలక అభివృద్ధి పనులపై సోమవారం రాత్రి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పనుల పురోగతిని అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.
ఆస్పత్రి నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు సీఎం వెల్లడించారు. ఆస్పత్రిని వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.