ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం తీవ్రంగా బాధించిందని పేర్కొంటూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మరోవైపు, ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆరా తీశారు. ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఉన్న మిగిలిన చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు మంత్రికి వివరించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై తక్షణమే విచారణ ప్రారంభించి పూర్తి వివరాలతో నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.