
భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’కు హాజరు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించారు. సదస్సులో భాగంగా నిర్వహించనున్న ‘రక్షణ ఎక్స్పో-2026’ను ప్రారంభించాలని అంతర్జాతీయ ప్రమాణాలతో ఎక్స్పోను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడితో వేర్వేరుగా భేటీ అయ్యారు. రక్షణ ఎక్స్‌పోలో దేశవ్యాప్తంగా రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్ట్‌పలు, యువ శాస్త్రవేత్తలు పాల్గొననున్నందున రాజ్‌నాథ్ హాజరై మార్గనిర్దేశం చేస్తే వారికి ఎంతో స్ఫూర్తినిస్తుందని సీఎం తెలిపారు.
ఎక్స్‌పోలో ఏరోస్పేస్ డిఫెన్స్ స్పేస్ రంగాలపై ప్రత్యేక సదస్సుతో పాటు ఎయిర్‌షో పారిశ్రామిక ప్రదర్శన భూరక్షణ వ్యవస్థల ప్రదర్శన నిర్వహించనున్నట్లు వివరించారు. ఎయిర్‌షోకు అవసరమైన గగనతల అనుమతులు మంజూరు చేయడంతో పాటు భారత వైమానిక దళ విమానాలు, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు పాల్గొనేలా సహకరించాలని కోరారు. స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శనకు త్రివిధ దళాల అత్యాధునిక రక్షణ వ్యవస్థల ప్రదర్శనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
హెచ్ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, ఎండీఎల్ వంటి ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు, డీఆర్డీవో ప్రయోగశాలలు ఎక్స్‌పోలో పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించేలా చూడాలని సీఎం కోరారు. అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రతినిధులతో సమావేశాల నిర్వహణకు కేంద్ర రక్షణ శాఖ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు భూమి
ఆదిలాబాద్ విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూసేకరణ చేపట్టిందని రేవంత్‌రెడ్డి రాజ్‌నాథ్‌కు తెలిపారు. రక్షణ శాఖ 1,500 ఎకరాలు కోరిన నేపథ్యంలో మరో 750 ఎకరాలు సేకరించి ఇస్తామని చెప్పారు.
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్డీఎల్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు టీజీఐఐసీ ఇప్పటికే అంగీకరించిందని సీఎం వివరించారు. ఎకరానికి కాకుండా మొత్తం భూమికి ఏడాదికి కేవలం రూ.1 నామమాత్రపు లీజు అద్దెతో 33 ఏళ్ల కాలానికి భూమిని కేటాయించనున్నట్లు తెలిపారు. అవసరమైతే మరో రెండుసార్లు లీజును పొడిగించుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
