
హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్(X) వేదికగా పోస్టు చేశారు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రముఖ విద్యాసంస్థల ఆఫ్‌షోర్ క్యాంపస్‌ల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోందని సీఎం తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్, నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నాయని వెల్లడించారు. హార్వర్డ్ యూనివర్సిటీ కూడా తెలంగాణలో కోర్సులు, ప్రత్యేక ప్రోగ్రామ్‌లను నిర్వహించేందుకు ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు.
ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజ్‌లతో జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. లండన్ బిజినెస్ స్కూల్ (LBS), లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌తోనూ చర్చల్లో సానుకూల ఫలితాలు వచ్చాయని చెప్పారు. అమెరికాలోని MIT సహా ఇతర ప్రముఖ విశ్వవిద్యాలయాలతోనూ చర్చలు ఫలప్రదంగా జరిగాయని వెల్లడించారు.
అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సంయుక్త పరిశోధనలు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. అలాగే ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేక కోర్సులు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రపంచస్థాయి విద్య పరిశోధనలకు కేంద్రంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి అంతర్జాతీయ విద్యా శక్తికేంద్రంగా నగరాన్ని తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
