
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై హైకోర్టు సింగిల్ జడ్జి విధించిన స్టేను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పీల్‌కు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ అప్పీల్‌కు రెగ్యులర్ నంబర్ కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీకి డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు తుది తీర్పు కాకుండా మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనని, వాటిపై అప్పీల్ విచారణార్హం కాదని రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతర కారణాలను కూడా పేర్కొంటూ ప్రభుత్వ అప్పీల్‌కు రెగ్యులర్ నంబర్ కేటాయించలేదు.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేద, నిమ్న వర్గాలకు చెందిన యువతుల వివాహానికి ఆర్థికసాయం అందించి వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఉద్దేశించినవని తెలిపారు. ఈ పథకాలు బాల్య వివాహాలను అరికట్టడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. పథకాల అమలును అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లో ప్రజాప్రయోజనం లేదని వాదించారు.
వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ విచారణార్హతపై పరిశీలన జరిపింది. సంక్షేమ పథకాలను అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న విచక్షణాధికారమని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పీల్‌కు రెగ్యులర్ నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దీంతో ఈ అప్పీల్‌పై మంగళవారం విచారణ జరగనుంది.
