హైదరాబాద్: తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌కు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానాలకు రూపకల్పన చేస్తోంది. ప్రస్తుత పారిశ్రామిక విధానానికి దాదాపు పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ‘ఇండస్ట్రియల్ పాలసీ 2.0’ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

భారీ పెట్టుబడులను ఆకర్షించడం, తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, ఆధునిక సాంకేతికత ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడం కొత్త పారిశ్రామిక విధానం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.

పారిశ్రామిక అభివృద్ధిని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా జిల్లాలు, టైర్-2, టైర్-3 నగరాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రాంతీయ సమతుల్య అభివృద్ధితో పాటు స్థానికంగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచేలా విధానాలను రూపొందిస్తోంది.

‘ఇండస్ట్రియల్ పాలసీ 2.0’లో భాగంగా మొత్తం 10 కీలక రంగాలకు ప్రత్యేక విధానాలను రూపొందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి కొత్త విధానాన్ని ప్రకటించగా.. మిగిలిన రంగాలపై కసరత్తు కొనసాగుతోంది.

లాజిస్టిక్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫుట్‌వేర్–లెదర్, అప్పెరల్–లైఫ్‌స్టైల్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCs), డేటా సెంటర్స్, ఆటోమొబైల్ తదితర రంగాలకు ప్రత్యేక విధానాలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త పారిశ్రామిక విధానాల ద్వారా తెలంగాణను పెట్టుబడులకు మరింత అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు పారిశ్రామిక వృద్ధి, సాంకేతికత, ఉపాధి కల్పనకు మరింత ఊతమివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

By Rajini