



ఖమ్మం: నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హంగూ ఆర్భాటాలకు దూరంగా సామాన్యులతో మమేకమయ్యారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేట శివారుల్లో తన కాన్వాయ్‌ను ఆపి నేరుగా పంట పొలాల్లోకి వెళ్లారు.
పొలాల్లో కూలీ పనులు చేస్తున్న మహిళా కార్మికుల వద్దకు వెళ్లిన భట్టి విక్రమార్క వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనానికి సిద్ధమవుతూ క్యారేజీలు విప్పుకుంటున్న మహిళలతో కలిసి కొద్దిసేపు గడిపారు. ‘‘ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మీ ఇళ్లకు అందుతున్నాయా తల్లులారా?’’ అంటూ ఆప్యాయంగా పలకరించారు.
తమ మధ్యకు ఉప ముఖ్యమంత్రి రావడంతో మహిళా కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో తమ జీవితాల్లో వచ్చిన మార్పులను వివరించారు.
ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో తమ కుటుంబాలు సంతోషంగా భోజనం చేస్తున్నాయని మహిళలు తెలిపారు. తమ పిల్లలు కడుపునిండా అన్నం తింటున్నారని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఉచిత విద్యుత్‌పై అడిగినప్పుడు ‘‘మాకు రూపాయి బిల్లు కూడా రావడం లేదు సార్ ప్రభుత్వమే ఉచితంగా ఇస్తోంది’’ అంటూ తమకు కలిగిన ఆర్థిక ఉపశమనాన్ని వివరించారు.
ఇటీవల హైదరాబాద్‌కు కూలీ పనుల కోసం వెళ్లిన సందర్భాలను గుర్తుచేసుకున్న మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం తమకు ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. ప్రయాణ ఖర్చులు ఆదా కావడంతో ఆ డబ్బును కుటుంబ అవసరాలకు వినియోగించుకోగలుగుతున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజలు ఉచితంగా పొందుతున్న ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం ఆయా శాఖలకు క్రమం తప్పకుండా విడుదల చేస్తోందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించడం, వాటిని తీర్చడం, వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.
