
తెలంగాణవ్యాప్తంగా ఆటో, క్యాబ్ సంఘాలు చేపట్టాలని నిర్ణయించిన సమ్మెకు బ్రేక్ పడింది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించుకుంటున్నట్లు ఆటో, క్యాబ్ కార్మిక సంఘాలు ప్రకటించాయి. తమ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగాలని ఆటో, క్యాబ్ యూనియన్లు నిర్ణయించాయి.
స్కూల్ డ్రైవర్ల అసోసియేషన్ కూడా ఈ సమ్మెకు మద్దతు ప్రకటించింది. దీంతో సోమవారం నుంచి సమ్మె ప్రారంభం కావాల్సి ఉండగా ప్రజలు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండటంతో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో ఆటో, క్యాబ్ కార్మిక సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వ అధికారులు సమావేశమయ్యారు.
కార్మిక సంఘాలు చేసిన పలు డిమాండ్లపై అధికారులు సానుకూలంగా స్పందించారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొని సంఘాల ప్రతినిధులతో చర్చించారు. చర్చలు సానుకూలంగా సాగడంతో ప్రతిపాదిత సమ్మెను విరమించుకుంటున్నట్లు ఆటో, క్యాబ్ సంఘాలు వెల్లడించాయి.
తమ డిమాండ్లపై త్వరగా జీవోలు విడుదల చేయాలని కార్మిక నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అంశాలపై హామీలు ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12 వేల ఆర్థిక సాయం అంశాన్ని కేబినెట్లో చర్చిస్తామని తెలిపారు. ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోల ప్రచారం జరుగుతోందన్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.
ఆటో చార్జీల సవరణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని 15 రోజుల్లో కమిటీ నివేదిక అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చే అంశంపై ఐటీ శాఖతో చర్చిస్తామని చెప్పారు. అలాగే ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంక్షేమ బోర్డు ఏర్పాటుపై కసరత్తు చేస్తామని మంత్రి వెల్లడించారు. సెప్టెంబర్ మొదటి వారంలో మంత్రుల సంయుక్త సమావేశం నిర్వహించి అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలపై చర్చిస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
