
D Educt: Aug 24: తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ.. టీ-శాట్ కీలక ప్రకటన
తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు టీ-శాట్ నెట్వర్క్ శుభవార్త అందించింది. పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం టీ-శాట్ ద్వారా ఉచిత డిజిటల్ కంటెంట్‌తో పాటు ప్రత్యేక లైవ్ శిక్షణ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీ-శాట్ సీఈఓ బొదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.
రేపటి నుంచి ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆయా సబ్జెక్టుల్లో నిపుణులతో ప్రత్యక్ష లైవ్ తరగతులను నిర్వహించనున్నారు. ఈ లైవ్ కార్యక్రమాల ద్వారా అభ్యర్థులు నిపుణులను నేరుగా ప్రశ్నించి తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కల్పించనున్నారు. పరీక్షలకు అవసరమైన అంశాలను సులభంగా అర్థం చేసుకునేలా నాణ్యమైన శిక్షణ అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను రూపొందించారు.
పరీక్షల వరకు 600 గంటల డిజిటల్ కంటెంట్
అభ్యర్థుల సమగ్ర సన్నాహకాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 600 గంటల రికార్డెడ్ డిజిటల్ కంటెంట్‌ను కూడా ప్రసారం చేయనున్నట్లు టీ-శాట్ సీఈఓ వెల్లడించారు. ఈ కంటెంట్‌ను టీ-శాట్ ‘విద్య’ ఛానెల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రసారం చేయనున్నారు.
అదేవిధంగా టీ-శాట్ ‘నిపుణ’ ఛానెల్లో ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పోలీసు ఉద్యోగాల పరీక్షలకు సంబంధించిన డిజిటల్ పాఠాలను అందించనున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలు పోలీసు నియామక పరీక్షలు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లే ఆర్థిక స్థోమత లేని గ్రామీణ ప్రాంతాల యువత, పేద విద్యార్థులకు ఈ ఉచిత డిజిటల్, లైవ్ తరగతులు ఎంతో ఉపయోగపడనున్నాయి. నిపుణుల మార్గదర్శకత్వంతో అభ్యర్థులు ఇంటి నుంచే పరీక్షలకు మెరుగ్గా సిద్ధమయ్యే అవకాశం కలుగుతుందని టీ-శాట్ ప్రతినిధులు తెలిపారు.
