పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉగ్ర లింకుల అనుమానాలు కలకలం రేపుతున్నాయి. రామగుండంలోని అయోధ్య నగర్‌లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

ఈ క్రమంలో రామగుండానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్‌ను NIA అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థలతో అతడికి సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

ముజామిల్ ఖాన్‌ను ఎన్‌టీపీసీ పోలీస్ స్టేషన్‌కు తరలించిన NIA అధికారులు అతడికి ఉగ్రవాదులతో ఉన్న పరిచయాలు, సంబంధాలు, ఇతర అనుబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దర్యాప్తులో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

మూడేళ్ల క్రితం కూడా కరీంనగర్ జిల్లాలో ఉగ్ర లింకుల వ్యవహారం వెలుగుచూసింది. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తిని అప్పట్లో NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

తాజాగా రామగుండంలో ఇంజినీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకుని NIA అధికారులు తనిఖీలు, విచారణ చేపట్టడంతో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంలో విద్యార్థికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్నది NIA దర్యాప్తు పూర్తయిన తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉంది.

By Rajini