
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు అందించనుంది. అనంతరం ఈ నివేదికను సోమవారం సాయంత్రం మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీకి పంపనున్నట్లు సమాచారం.
కొండా సురేఖతో పాటు మరో ఇద్దరి వ్యవహారంలోనూ కఠిన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. సురేఖ ఇచ్చిన వివరణపై కమిటీ సంతృప్తి చెందలేదని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆమె కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలను సురేఖ ఖండించాల్సి ఉన్నప్పటికీ, ఆమె అలా చేయలేదని కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని కమిటీ స్పష్టం చేసినట్లు సమాచారం. గతంలో కొండా సురేఖను కాపాడానని ఇక తన పరిధిలో తానేమీ చేయలేనని మహేశ్ కుమార్ గౌడ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఇటీవల క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
