
D Educt: Aug 22: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో తెలంగాణ భాగస్వామ్యం కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం
తెలంగాణలో విద్యాభివృద్ధికి సహకరించాలని, రాష్ట్రంలో విద్యాపరమైన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి శుక్రవారం సుమారు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సీఎం సందర్శించారు.
ఈ సందర్భంగా తెలంగాణతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యం, రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పించే అంశాలపై విద్యావేత్తలతో ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రణాళికలను వారికి వివరించారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్‌ను వారికి వివరించి, యూనివర్సిటీకి ఉన్న ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, పరిశోధన సామర్థ్యాలు, విస్తృత విద్యా వ్యవస్థను హైదరాబాద్‌కు తీసుకురావాలని ఆహ్వానించారు.
తెలంగాణ యువత, ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు అందించేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ముందుకు రావాలని సీఎం కోరారు. ఈ సమావేశంలో సీఎం కార్యాలయ సలహాదారు, ఎక్స్‌అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం కింద విదేశీ విశ్వవిద్యాలయాలకు అందుబాటులో ఉన్న అవకాశాలపై కె. రామకృష్ణారావు ప్రజంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో విదేశీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలు, వాటికి లభించే ప్రయోజనాలను వివరించారు.
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. అలాగే డిసెంబరు 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను తెలంగాణ బృందం ఆహ్వానించింది.
అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి చారిత్రక సోమర్‌విల్ కాలేజీని సందర్శించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఈ కాలేజీలో చదువుకున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన ఆమె చిత్రపటాన్ని సీఎం వీక్షించారు. ఈ చిత్రపటాన్ని 2002లో సోనియాగాంధీ సోమర్‌విల్ కాలేజీకి బహూకరించారు.
ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్‌ను సందర్శించారు. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ ఛైర్మన్ కిరణ్‌కుమార్ గ్రంధితో కలిసి అక్కడి క్రీడా సదుపాయాలను పరిశీలించారు. ఈ ప్రాంగణంలో గోల్ఫ్ కోర్స్‌తో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, హోటల్ ఉన్నాయి.
తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి జీఎంఆర్ ప్రతినిధులు, సంస్థ గ్లోబల్ స్పోర్ట్స్ యూనిట్‌తో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జీఎంఆర్ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు.
సాయంత్రం ప్రస్తుత ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్ ఆర్సెనల్, కోవెంట్రీ మధ్య జరిగే ఈపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎమిరేట్స్ స్టేడియాన్ని సందర్శించారు.
