
దేశంలోనే తొలిసారిగా విద్యార్థులు, పరిశ్రమలను నేరుగా అనుసంధానించే జాబ్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సోమవారం మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో పారిశ్రామిక ప్రాంతంలో ఆయన జాబ్ పోర్టల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సుమారు వెయ్యి పరిశ్రమలు ఉన్నాయని, వాటికి పెద్ద సంఖ్యలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరమని చెప్పారు. జిల్లా యంత్రాంగం, పరిశ్రమల యజమానులు కలిసి చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు.
నిరుద్యోగం దేశవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారిందని, స్థానిక పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగులు, స్కిల్డ్ లేబర్‌ను అందించేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థులు కేవలం సాఫ్ట్వేర్ రంగంపైనే దృష్టి పెట్టకుండా ఇతర రంగాల్లోనూ ఉన్న ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. టామ్‌కామ్ సంస్థ ద్వారా విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.
సింగరేణి ప్రాంతంలోని మందమర్రిలో యువతకు జర్మన్ భాషలో శిక్షణ ఇస్తున్నామని, కొందరు ఇప్పటికే B2 స్థాయికి చేరుకున్నారని చెప్పారు. వారికి రూ.25 లక్షల వరకు వార్షిక వేతనంతో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, వీసా ఖర్చుల్లో సగం వరకు ప్రభుత్వం భరిస్తోందని వెల్లడించారు. యువత విదేశాల్లో ఉద్యోగాలు పొందడం ద్వారా అనేక కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
