
తెలంగాణ జానపద కళకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ జానపద కడ్డీ తంత్రి కళాకారుడు దుర్శేటి రామయ్య కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. జానపద సంగీత విభాగంలో తెలంగాణ నుంచి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న ఆయన న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించారు.
తెలంగాణ జానపద సంగీత సంప్రదాయాన్ని కడ్డీ తంత్రి కళను ఎన్నో ఏళ్లుగా పరిరక్షిస్తూ భావితరాలకు పరిచయం చేస్తున్న రామయ్య సేవలకు ఈ అవార్డు గుర్తింపుగా నిలిచింది. రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకోవడం గర్రెపల్లి గ్రామానికే కాకుండా తెలంగాణ జానపద కళాకారులందరికీ గర్వకారణంగా మారింది.
తమ గ్రామానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన రామయ్యను గ్రామస్తులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పురస్కారం తెలంగాణ జానపద కళలకు మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు యువతలో సంప్రదాయ కళలపై ఆసక్తిని పెంచేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
