
రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను వసూలు చేయడమే ప్రధాన లక్ష్యంగా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బకాయిల వసూళ్లకు సమగ్ర విధానాన్ని రూపొందించి, కేబినెట్ సబ్ కమిటీలో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మిల్లర్లు ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీఎం స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో సివిల్ సప్లయిస్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ స్టీఫెన్ రవీంద్ర, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మిల్లర్ల నుంచి రావాల్సిన బకాయిలను తక్షణమే వసూలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ చేసి బకాయిలు చెల్లించని రైస్ మిల్లులను స్వాధీనం చేసుకుని మహిళా సంఘాలకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అవసరమైతే ఆయా మిల్లుల్లో మిల్లింగ్ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు.
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న గోడౌన్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ధాన్యం అధికంగా ఉత్పత్తి అయ్యే ప్రాంతాల్లో ఐదు నియోజకవర్గాలను ఎంపిక చేసి, మహిళా సంఘాల ఆధ్వర్యంలో 50 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో గోడౌన్ల నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. సివిల్ సప్లయిస్ శాఖలో పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేందుకు ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
