
హైదరాబాద్‌లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల్పనే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. కేపీహెచ్‌బీ కాలనీలో సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేయనున్నారు. హైదరాబాద్‌లో లక్ష ఫ్లాట్ల నిర్మాణం లక్ష్యంగా తొలిదశలో 18 ప్రాంతాల్లో 7,340 ఫ్లాట్లను నిర్మించనున్నారు.
ఇందుకోసం ప్రభుత్వం రూ.807.40 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయం రూ.11 లక్షలు కాగా ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ, లబ్ధిదారుడి వాటాగా రూ.6 లక్షలు నిర్ణయించింది. ఒక్కో ఫ్లాట్‌లో 400 చదరపు అడుగుల కార్పెట్ 528 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా ఉంటుంది.
ఇందిరమ్మ ఫ్లాట్లకు దరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు. CURE పరిధిలో సొంత ఇల్లు, స్థలం లేదా ఫ్లాట్ ఉండకూడదు. ఒక్క కుటుంబానికి ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయిస్తారు. ప్రస్తుతం నివసిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రాజెక్టుకే దరఖాస్తు చేసుకోవాలి.
ఆగస్టు 15 దరఖాస్తుకు చివరి తేదీ. అర్హతల పరిశీలన అనంతరం లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయిస్తారు. దరఖాస్తుకు రూ.100 ఫీజుతో పాటు రూ.10 వేల టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలి. ఫ్లాట్ రాకపోతే ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు; కేటాయిస్తే లబ్ధిదారుడి వాటాలో సర్దుబాటు చేస్తారు.
కేపీహెచ్‌బీ, కౌకూర్, రాయదుర్గం, జల్‌పల్లి, రెడ్‌హిల్స్, పాటిగడ్డ, గడ్డిఅన్నారం, బండ్లగూడ, పోచారం, మైలార్‌దేవ్‌పల్లి, గాజులరామారం తదితర ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి.
