
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన టెసరాక్ట్ అడ్వాన్డ్స్ సిస్టమ్స్ కంపెనీకి విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపుపై విచారణ చేయాలి. ఒక్క ఉద్యోగీ లేని కేవలం లక్ష రూపాయల మూలధనంతో ఏర్పాటు చేసిన కంపెనీకి రూ.200కోట్ల విలువైన భూమిని ఎలా కేటాయిస్తారు!? కంపెనీ వివరాలు దాని మూలధనం ఉద్యోగుల సంఖ్య కార్యాలయ చిరునామా కంపెనీ చైర్మన్ వ్యవహారం ప్రభుత్వ భూమి కేటాయింపు తదితర అంశాలను పరిశీలిస్తే భారీ కుంభకోణం జరిగిందని స్పష్టంగా అర్ధమవుతోంది.
ఇది రాష్ట్రంలో జరిగిన అతి పెద్ద భూ కేటాయింపు అక్రమాల్లో ఒకటని అనుమానిస్తున్నాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొండల్ రెడ్డి తన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో టెసరాక్ట్ భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు తానే బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొన్నారని ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో టెసరాక్ట్ పని చేస్తున్నట్లు పేర్కొంటూ నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా కాన్సల్ జనరల్ కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు. యూఎ్స-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెసరాక్ట్ చైర్మన్గా కొండ ల్ అనుముల చేరినట్లు ఆ సంస్థ ప్రకటించిందన్నారు.
కంపెనీ వెబ్సైట్లో పేర్కొన్న ఫోన్ నంబరు 123456789గా ఉందని తప్పుబట్టారు. పటాన్చెరు ప్రాంతంలో ఒక చిన్న చిరునామాను కార్యాలయంగా చూపిస్తున్నారని అన్నారు. ఈ కంపెనీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుమారు ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. దాని విలువ రూ.200 కోట్లు. కానీ ఆ భూమిని గజానికి రూ.3,700 చొప్పున సుమారు రూ.7 కోట్లకే కేటాయించినట్లు మాకు సమాచారం ఉంది. ఇది స్కామ్ కాదా!? అని ప్రశ్నించారు. భూమి కేటాయింపునకు సంబంధించిన అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.
