
D News: Jul 15: హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి దారుణ హత్య కలకలం రేపింది. అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఓ యువకుడిపై కొందరు దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్‌గా గుర్తించారు.
ప్రాథమిక దర్యాప్తులో ఈ హత్యకు పాత ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. భాస్కర్ గతంలో తన స్వగ్రామానికి చెందిన నిఖిత అనే యువతిని ప్రేమించాడని, అయితే కులాంతర వివాహం కావడంతో కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించలేదని సమాచారం. దీంతో మూడేళ్ల క్రితం ఆ యువతికి మరో వ్యక్తితో వివాహం జరిపించారు. అనంతరం దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తడంతో ఆమె విడాకులు తీసుకుంది.
తన కుమార్తె విడాకులకు భాస్కరే కారణమని భావించిన యువతి తండ్రి రాజు అతనిపై కక్ష పెంచుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా భాస్కర్‌ను చంపేస్తామని రాజు, కుటుంబ సభ్యులు బెదిరించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో మంగళవారం ఐదుగురు యువకులు హైదరాబాద్‌కు చేరుకుని అయ్యప్ప సొసైటీలోని భాస్కర్ ఉంటున్న హాస్టల్ వద్దకు వెళ్లారు. అక్కడ అతనిపై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేసి అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై మృతుడి అన్న చిన్నపల్లి మధు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రేమ వ్యవహారాన్ని కారణంగా చూపుతూ రాజు, కుమారస్వామి, నాగరాజు, రాహుల్‌తో పాటు మరో వ్యక్తి కలిసి తన తమ్ముడిని హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మృతుడి అన్న తెలిపిన వివరాల ప్రకారం, వర్ధన్నపేటలో ఉన్న సమయంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భాస్కర్‌కు ఆ యువతితో పరిచయం ఏర్పడిందని, విషయం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌కు పంపించినట్లు చెప్పారు. భాస్కర్ గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు.
అలాగే, యువతికి వివాహం జరిగిన తర్వాత కూడా ఆమెనే భాస్కర్‌కు సందేశాలు పంపేదని, వారి పాత పరిచయం విషయం తెలిసి ఆమె భర్త విడాకులు ఇచ్చాడని పేర్కొన్నారు. అప్పట్లో ఈ వ్యవహారంపై వర్ధన్నపేటలో ఒక కేసు కూడా నమోదైందని చెప్పారు.
తన తమ్ముడు ఆ యువతిని గానీ, ఆమె చెల్లిని గానీ ఎప్పుడూ బెదిరించలేదని, అలాంటి ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని భాస్కర్ అన్న డిమాండ్ చేశాడు. ఎలాంటి తప్పు చేయని తన తమ్ముడిని కక్షపూరితంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
