
D News: Jul 15: తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడి.. ఫ్యూచర్ సిటీలో రూ.60 వేల కోట్ల మెగా డేటా సెంటర్‌కు శంకుస్థాపన
తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ సమీపంలోని ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ఏర్పాటు చేయనున్న భారీ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఐటీ రంగంలో మరో మైలురాయిగా నిలవనుంది.
ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాల విస్తీర్ణంలో రూ.60 వేల కోట్ల భారీ పెట్టుబడితో ఈ మెగా డేటా సెంటర్‌ను అమెజాన్ నిర్మించనుంది. వచ్చే 12 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును దశలవారీగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. అదనంగా చందనవెల్లి ప్రాంతంలో మరో 98 ఎకరాల భూమిని కూడా అమెజాన్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. హైదరాబాద్‌లో అమెజాన్‌కు చెందిన రెండో క్లౌడ్ రీజియన్‌గా, దేశంలోనే అతిపెద్ద హైపర్‌స్కేల్ డేటా సెంటర్లలో ఒకటిగా ఇది రూపుదిద్దుకోనుంది.
2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని తెలిపారు. పెట్టుబడిదారులకు సింగిల్ విండో విధానంలో వేగంగా అనుమతులు అందిస్తూ పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
కాలుష్య నియంత్రణకు ఈవీల ప్రోత్సాహం.. నగరాభివృద్ధికి కీలక ప్రాజెక్టులు
హైదరాబాద్‌లో ట్రాఫిక్, కాలుష్య సమస్యలను తగ్గించేందుకు 3 వేల ఆర్టీసీ బస్సులను, 2 లక్షల ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రణాళిక అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్‌పై జీరో ట్యాక్స్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. నగరాభివృద్ధిలో భాగంగా మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైలు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఫార్మా పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) అవతలకు తరలించే చర్యలు కూడా చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
