
D Spiritual: Dec 15: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 14 వరకు ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 4.30 గంటల నుంచి 5 గంటల వరకు శ్రీస్వామివారి ఆలయ ముఖ మండపంలోని ఉత్తర భాగం హాల్లో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెంకట్రావ్ వెల్లడించారు.
ధనుర్మాసోత్సవాల నేపథ్యంలో స్వామివారి నిత్య కైంకర్యాల సమయాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 3.30 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, 4 గంటల నుంచి 4.30 గంటల వరకు తిరువారాధాన నిర్వహిస్తామన్నారు.
అనంతరం 4.30 గంటల నుంచి 5 గంటల వరకు తిరుప్పావై సేవాకాలం, 5 గంటల నుంచి 6 గంటల వరకు నివేదన, చాత్మర సేవలు జరుగుతాయని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు నిజాభిషేకం, 7 గంటల నుంచి 7.45 గంటల వరకు సహస్రనామార్చన నిర్వహిస్తామని తెలిపారు.
ఉదయం 7.45 గంటల నుంచి స్వామివారి సర్వదర్శనాలు భక్తులకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అలాగే ధనుర్మాసోత్సవాల్లో భాగంగా జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదాదేవి కల్యాణం, 15న ఉదయం 11.30 గంటలకు ఒడిబియ్యం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
