D Spiritual: Dec 15: శివుడు… శంకరుడు… పరమేశ్వరుడు… రుద్రుడు… భోలేనాథ్… ముక్కంటి… ఇలా ఎన్నో నామాలతో పూజించబడే ఆ ఆదియోగికి ప్రతి అణువణువుకు ఓ గొప్ప చరిత్ర ఉందని పురాణాలు చెబుతున్నాయి. చేతిలో శూలం, మెడలో సర్పం, పులిచర్మం కట్టుకుని, ఒళ్లంతా బూడిద పూసుకుని ఎల్లప్పుడూ ధ్యానంలో లీనమై ఉండే శివుడి మహిమలు వర్ణనాతీతం. అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మసందేహానికి పురాణాల్లో భిన్నమైన కథలు వినిపిస్తుంటాయి. తెరిస్తే చాలు సమస్తం భస్మమయ్యే ఆ మూడో కన్ను గురించి పురాణాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకుందాం.

ఎండికొండాలు ఏలేటోడా… అడ్డబొట్టు శంకరుడా… అంటూ శివభక్తులు భక్తి పరవశంతో ఊగిపోతుంటారు. హిమాలయాల్లో ధ్యానమగ్నుడై ఉండే ఆదియోగి ఆజ్ఞ లేకుండా చీమైనా కదలదని భక్తుల విశ్వాసం. ‘పాహి’ అని పిలిచిన వెంటనే ప్రత్యక్షమై వరాలు కురిపించే స్వభావం కారణంగా ఆయనకు ‘బోళా శంకరుడు’ అనే పేరు వచ్చింది. ఇంత శాంతస్వరూపుడు, కరుణామయుడు అయిన ముక్కంటి మూడో కన్ను తెరిస్తే మాత్రం ప్రళయమే సంభవిస్తుంది. ఆ నీలకంఠుడికి మూడో కన్ను ఎలా వచ్చిందన్న ప్రశ్నకు పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి.

ఒకరోజు శివుడు ధ్యానంలో లీనమై ఉన్న సమయంలో ఆయన భార్య పార్వతీదేవి అక్కడికి వస్తుంది. శివుడు లోతైన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి సరదాగా ఆయనను ఆటపట్టించాలని భావిస్తుంది. శివుడి వెనకనుంచి వెళ్లి తన రెండు చేతులతో ఆయన రెండు కన్నులను మూసేస్తుంది. శివుడి ఎడమ కన్ను చంద్రుడిని, కుడి కన్ను సూర్యుడిని సూచిస్తాయి. ఆ రెండు కన్నులు మూసుకుపోవడంతో ముల్లోకాలు చీకటిలో మునిగి అల్లకల్లోలంగా మారతాయి. దేవతల నుంచి సామాన్యుల వరకు అందరూ భయాందోళనకు గురవుతారు.

ఈ పరిస్థితిని గమనించిన నీలకంఠుడు తన అంతర్గత శక్తిని సమీకరించి నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపజేస్తాడు. ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసరింపజేస్తాడు. ఈ సంఘటనతోనే శివుడికి మూడో కన్ను ఏర్పడిందని పురాణాలు చెబుతాయి. అయితే ఆ అగ్నివేడి వల్ల పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా, ఆ చెమట చుక్కల నుంచే అంధకుడు జన్మించాడని కూడా పురాణగాథలు వివరిస్తాయి.

ఇదిలా ఉండగా, మరో కథ కూడా ప్రసిద్ధిగా ఉంది. ఆదిపరాశక్తి బ్రహ్మ, విష్ణు, శంకరులను సృష్టించి, వారిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాలని ఆజ్ఞాపిస్తుంది. అయితే ముగ్గురూ ఆ ప్రతిపాదనను నిరాకరిస్తారు. దీంతో ఆగ్రహించిన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురినీ భస్మం చేస్తానని హెచ్చరిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు ముందుకొచ్చి ఒక పరిష్కారం సూచిస్తాడు. తనకు ఆ మూడో కన్ను ఇస్తే తాను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు.

అనంతరం ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్నును ప్రసాదిస్తుంది. ఆ కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు. ఆ భస్మంలో ఒక భాగం నుంచి పార్వతి, మరో భాగం నుంచి లక్ష్మి, ఇంకో భాగం నుంచి సరస్వతి జన్మించారని పురాణాలు పేర్కొంటాయి. ఇలా ముక్కంటి అయిన శివుడి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana