
D Spiritual: Nov 11: శీతాకాలం నేపథ్యంలో కేదార్‌నాథ్ ఆలయం మూసివేత
వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ తలుపులకు తాళం.. ఊఖీమఠ్‌కు ఉత్సవ విగ్రహమూర్తి తరలింపు
ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని శీతాకాలం ప్రారంభం నేపథ్యంలో బుధవారం మూసివేశారు. ఉదయం 8.30 గంటలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ద్వారాలకు తాళం వేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కేదార్ విగ్రహమూర్తిని భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగింపుగా తరలించారు.
ఆలయ మూసివేత కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయబద్ధంగా అన్ని క్రతువులను నిర్వహించిన అనంతరం శుభ ముహూర్తంలో ఆలయ ద్వారాలను మూసివేశారు. బాబా కేదార్ ఉత్సవ విగ్రహమూర్తిని ఉత్తరాఖండ్‌లోని ఊఖీమఠ్‌లో ఉన్న ఓంకారేశ్వర్ ఆలయానికి తరలించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని ‘హర హర మహాదేవ్’ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపారు.
మళ్లీ వేసవిలోనే దర్శనాలు
ఈ ఏడాది సుమారు 19 లక్షల మంది భక్తులు కేదారేశ్వరుడిని దర్శించుకున్నట్లు సమాచారం. శీతాకాలం నేపథ్యంలో ఆలయాన్ని మూసివేస్తున్న సందర్భంగా మంగళవారం సాయంత్రం కేదార్‌నాథ్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం హారతి ముగిసిన అనంతరం భారత సైన్యానికి చెందిన బ్యాండ్ బృందం ప్రత్యేక సంగీత ప్రదర్శన ఇచ్చింది. ఆలయ ప్రధాన పూజారి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
శీతాకాలం ముగిసి వేసవి కాలం ప్రారంభమైన తర్వాత తిరిగి కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను తెరుస్తారు. అప్పటివరకు బాబా కేదార్ ఉత్సవ విగ్రహమూర్తికి ఊఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో భక్తులు దర్శనం చేసుకోవచ్చు. చార్‌ధామ్ యాత్రలో భాగమైన యమునోత్రి ఆలయాన్ని కూడా బుధవారం శీతాకాలం నేపథ్యంలో మూసివేశారు.
